Wednesday, October 6, 2010

అగ్నిష్వాత్తపితరుల చరితము

పితృవంశీయాచ్ఛోదోపాఖ్యానమ్‌.

సూతః: లోకా స్సోమపథానామ యత్ర మారీచనన్దనాః | వ ర్తన్తే దేవపితరో యా న్దేవా భావయన్త్యలమ్‌. 1
అగ్ని ష్వాత్తా ఇతి ఖ్యాతా యజ్వానో యత్ర సరిస్థతా | అచ్ఛోదానామ తేషాంతు మానసీ కన్యకా సరిత్‌. 2
అచ్ఛోదంనామచ సరః పితృభి ర్ని ర్మితంపురా | అథతత్ర తపశ్చక్రే దివ్యం వర్షసహస్రకమ్‌. 3
ఆజగ్ముః పితరస్తుష్టాః కిల దాస్యామ తే వరమ్‌ | దివ్యరూపధరా స్సర్వే దివ్యమాల్యానులేపనాః. 4
సర్వే యువానో బలినః కుసుమాయుధసన్నిభాః | తన్మధ్యే మావసుంనామ పితరం వీక్ష్య సాఙ్గనా. 5
వవ్రే వరార్థినీ సఙ్గం కుసుమాయుధపీడితా | యోగభ్రష్టాతు సా తేన వ్యభిచారేణ భామినీ. 6
ధరా మస్పృశతీ పూర్వం పపాతాథ భువస్థ్సలే | తథాచ మాదసుర్యస్మా దిచ్ఛాం చక్రే న తాం ప్రతి. 7
ధైర్యేణ తస్య సాలోకే అమావాస్యేతి విశ్రుతా | పితౄణాం వల్లభా తస్మా ద్దత్తస్యాక్షయకారకా. 8
ఆచ్ఛోదా7ధోముఖీ దీనా లజ్జితా తపనఃక్షియాత్‌ | సా పితౄ నా్ర్పర్థయామాస పునరాత్మసమృద్ధయే. 9
విలజ్జమానా పితృభి రిదముక్తా తపస్వినీ | భవిష్యదర్థ మాలోక్య దేవకార్యంచ తేతదా. 10
ఇదమూచు ర్మహాభాగాః ప్రసాదా చ్ఛుభయా గిరి | దివి దివ్యశరీరేణ యత్కిఞ్చి తి్ర్కయతే బుధైః. 11
తేనైవ తత్కర్మఫలం భుజ్యతే వరవర్ణిని | సద్యః ఫలన్తి కర్మాణి దేవత్వే ప్రేత్య మానుషే. 12
తస్మాత్త్వం పుత్తి్ర తపసా ప్రాప్స్యసే ప్రేత్యతత్ఫలమ్‌ | అష్టావింశే భవిత్రీ త్వం ద్వాపరే *మీనయోనిజా.
వ్యతిక్రమ్య పితౄణాంత్వం కష్టం కుల మవాప్స్యసి | తస్మాద్రాజ్ఞో వసోఃకన్యా త్వమవశ్యం భవిష్యసి. 14
కన్యాభూత్వైవ లోకాన్త్సా్వ న్పునః ప్రాప్స్యసి దుర్లభా | పరాశరస్య వీర్యేణ సుతమేక మవాస్స్యసి. 15
ద్వీపేతు బదరీప్రాయే బాదరాయణ మచ్యుతమ్‌ | స వేద మేకం బహుధా విభజిష్యతి తే సుతః. 16
పౌరవస్యాత్మజౌ ద్వౌతు సముద్రాంశస్య శన్తనోః | విచిత్రవీర్యతనయ స్తదా చిత్రాఙ్గదో నృపః. 17
ఇమావుత్పాద్య తనయౌ క్షత్తియ్రా వస్యధీమతః | ప్రౌష్ఠపద్యష్టకారూపా పితృలోకే భవిష్యసి. 18
నామ్నా సత్యవతీ లోకే పితృలోకే తథా7ష్టకా | ఆయురారోగ్యదా నిత్యం సర్వకామఫలప్రదా. 19
భవిష్యసి పరేలోకే నదీత్వం చ గమిష్యసి | పుణ్యతోయా సరిచ్ఛేష్ఠ్రా లోకే ష్వచ్ఛోదసంజ్ఞితా. 20
ఇత్యుక్త్వా సగణస్తేషాం తతైవ్రాన్తకధీయత | సాప్యవాప సుచారిత్రఫలం యత్కథితం పురా. 21

ఇది శ్రీ మత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే పితృవంశీయాచ్ఛోదో పాఖ్యానవర్ణనం నామ చతుర్దశో7ధ్యాయః.

చతుర్దశాధ్యాయము

(పితరుల కన్యయగు అచ్ఛోద చరితము.) అగ్నిష్వాత్తపితరుల చరితము

(పురాణములందును శాస్త్రములందును చెప్పబడిన పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వీరిలో మూడు మూర్తిలేని గణములు. ఆ గణముల పేర్లు 1. వైరాజులు 2. అగ్నిష్వాత్తులు 3. బర్హిషదులు; మూర్తి కలవి నాలుగు గణములు. 1. సుకాలినః 2. హవిష్మంతః 3. ఆజ్యపాః 4. సోమపాః. వీరిలో మొదటి గణము విషయము పదుమూడవ అద్యాయమున చెప్పబడినది. ఈ అధ్యాయమున రెండవ గణమువారి విషయము చెప్పబడును.

(ప్రతి గణము విషమునను తెలియవలసిన విషయములు-1. ఆ గణము వారు నివసించు లోకము. 2. ఆ గణము పేరు. 3. వారి తండ్రి నామము 4. ఆ గణము వారిని ఆరాధించు వారు. 5. వారి మానసీకన్యా నామము.)

సోమ పథములను లోకములు గలవు. వీనియందు మరీచి అను ప్రజాపతికి కుమారులు అగు పితృదేవతలు నివసింతురు. వీరిని దేవతలు ఆరాధింతురు. ఈ పితరులకు అగ్నిష్వాత్తులు అని పేరు. (అగ్నిషు-ఆత్త=ఆగ్నులయందు సమగ్రముగా హవిస్సు వేల్చి యజ్ఞములను చేసినవారు.) వీరందరును యజ్వలు-యజ్ఞములను చేసినవారు.

వారి మానపుత్రిక అచ్ఛోదా అను ఆమె. ఆమె నదీరూపురాలు ఐనది. పూర్వము పితృదేవతలు అచ్ఛోదమను సరస్సును సృష్టించిరి. ఆ సరస్తీరమున ఈమె వేయి దివ్య సంవత్సరముల కాలము తపస్సు ఆచరించెను. పితరులు సంతుష్టులై ఆమె కడకు వచ్చిరి. నీకేమి వరము కావలెనో ఇత్తుము. కోరుకొనుము-అనిరి. వారందరును దివ్యములగు రూపముల ధరించినవారు దివ్యములగు మాలికలు పుష్పములు దాల్చినవారు. దివ్యగంధములు పూసికొనినవారు. యువకులు; బలశాలురు; మన్మథుని వంటివారు. వారిలోనుండి "మావసుడు' అను పితరుని ఆమె కామపరవశురాలై వరునిగా కోరుకొనెను. ఆ సుందరి ఈ వ్యభిచార దోషముచేత యోగ భ్రష్టురాలయ్యెను. అంతవరకును దేవభావమున భూమిని తాకకయున్న ఆమె భూస్థలిపై పడిపోయెను.

కాని మావసుడు ఆ అచ్ఛోదను కామించక ధైర్యముతో ఉండెను. అందుచే ఆమె "మావస్య' (మావనునికి ప్రియురాలు) కాలేదు. కనుక ఆమెకు "అమావస్య' అను పేరు వచ్చెను (మావస్యకానిది) తన తపస్సుచే పితరులను మెప్పించినందున ఈ అచ్చోద లేదా అమావాస్య పితృదేవతలకు ఇష్టురాలు మాత్రమయినది. అందుచే అమావస్యా (అమావాస్యా) తిథియందు పితరులకు ఆర్పించినది అక్షయమగును. అనంతఫలమును ఇచ్చును.

_____________________________________________________________________________________

* మత్స్య.

తన తపస్సు తన ఈ దోషముచే క్షీణించుటవలన అచ్ఛోద దీనురాలయి ముఖము వంచుకొని సిగ్గుపడుచు తాను మరల తన తపస్సును సమృద్ధి నొందించుకొనుటకై ఉపాయమును తెలుపవలసినదిగా తన తండ్రులగు పితరులను వేడుకొనెను. ఆ మహాభాగులు అనుగ్రహము కలవారైరి. వారు జరుగబోవు విషయములను దేవకార్యమును (తమ ధ్యాన దృష్టితో) దర్శించిరి. శుభమగు వాక్కుతో వారు ఆ తపస్విని (తపోవంతురాలు-జాలిపడదగిన దీనురాలు) తో ఇట్లు పలికిరి: సుందరియగు పుత్తీ్ర! వివేకవంతులగు వారు (భూలోక సంబంధి కానటువంటి) దివ్య శరీరముతో చేసిన ఏ కర్మమునకైనను ఫలమును వారు అదే శరీరముతో అనుభవింతురు. మానుష శరీరముతో నున్నవారు మాత్రము తాము చేసిన కర్మల ఫలమును (కొన్నిటిని) ఆ దేహమును విడిచిన తరువాత అనుభవింతురు. (నీవు మనుష్య స్త్రీగా అయియున్నావు. కనుక) నీవు తపస్సు ఆచరించినచో దాని ఫలమును నీవు ఈ దేహమును విడిచిన తరువాత (మరియొక జన్మములో కాని దేవలోకమునకాని) అనుభవింతువు.

ఇప్పుడు నీవు నీ తండ్రుల విషయమున వ్యతిక్రమము (నియమము తప్పి కామ బుద్ధిని చూపుట) చేసితివి. కనుక ఇరువది ఎనిమిదవ ద్వాపరయుగమున చేప కడుపున జన్మించి నీచమగు కులమును చేరుకొందువు. ఇది జరుగుటకై నీవు తప్పక వసుడను రాజునకు కూతురవు అగుదువు. కన్యగా ఉండి (కన్యాత్వము చెడకయే) చివరకు మరల దుర్లభములగు నీలోకములను నీవు చేరెదవు. ఎట్లన-పరాశరుని విర్యముతో ఒక కుమారుని కనెదవు. అతడు సాక్షాత్‌ అచ్యుతు (నారాయణు) డే. బదరీవృక్షములు తరచుగా కల ద్వీపమున జనించుటచే అతనికి బాదరాయణుడు అని వ్యవహారము కలుగును. ఆ నీకుమారుడు ఒకటిగా అయి యున్నవేదమును నాలుగుగా విభజించును. సముద్రుని అంశచెత జనించిన పూరు వశీయుడైన శంతనుని వలన చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అను కుమారులను ఇద్దరను కనెదవు. భూలోకమున నీకు సత్యవతి అనిపేరు. పితృలోకమున నీకు అష్టకా అని పేరు. అచట నీవు ప్రౌష్ఠపదీ-అష్టకా-(భాద్రపద శుక్ల పూర్ణిమ గడచిన వెంటనే వచ్చు సప్తమీ తిథి) రూపముతో ఉందువు. నీవు పర (పితృ) లోకమునందుండి ప్రాణులకు ఆయురారోగ్యములను కోరిన ఫలములను ఇత్తువు.

నీవు భూలోకమున నదీ రూపమును పొంది అచ్ఛోద అను పేర పుణ్యజలములుగల నదీ శ్రేష్ఠవైయుందువు.

ఇట్లు పలికి ఆ పితృగణము అచ్చటనే అంతర్ధానమును పొందిరి. ఆ అచ్ఛోదయను పితృ కన్యయును వారిచే ఇంతవరకును చెప్పబడిన సత్కర్మ ఫలమును పొందెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున పితృకన్యయగు అచ్ఛోద చరితమను చతుర్దశాధ్యాయము.

No comments: